ఉరవకొండ అక్టోబర్ 23:
ఆర్థిక,మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ఉరవకొండ నియోజకవర్గంలోనిపెన్నాహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గురువారం పరిశీలించారు. ఇదే క్రమంలో ఆయన బెలుగుప్ప, శీర్పి చెరువులకు జీడిపల్లి రిజర్వాయర్ నుండి నీటిని అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గురువారం నాడు మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గం, బెలుగుప్ప మండలం, శీర్పి గ్రామం వద్ద పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శీర్పి చెరువు మరియు బెలుగుప్ప చెరువులకు జీడిపల్లి రిజర్వాయర్ నుండి నీరు వెళ్లే కాలువను, ముఖ్యంగా పంపింగ్ స్టేషన్ 9, 10 నుండి నీరు సరఫరా అయ్యే మార్గాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, "జీడిపల్లి రిజర్వాయర్ నుండి పంపింగ్ స్టేషన్ 9, 10 ద్వారా బెలుగుప్ప, శీర్పి చెరువులకు నీరందించాలి. మా ప్రభుత్వం అన్ని చెరువులకు నీరు అందించేందుకు కట్టుబడి ఉంది" అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ (HNSS) గుంతకల్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసనాయక్, డిఈ వెంకటరమణ, ఏఈఈ ఏ.సుదర్శన్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment