ధర్మవరం, అక్టోబర్ 09 (ట్రూ టైమ్స్ ఇండియా): కేంద్ర ప్రభుత్వం వైద్య పరికరాలపై జీఎస్టీని 18% నుంచి 5%కు తగ్గించడం వల్ల ఆసుపత్రులకు, అంతిమంగా సామాన్య ప్రజలకు మెరుగైన, చవకైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ హరీష్ బాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, ధర్మవరం ఏరియా హాస్పిటల్‌లో గురువారం నిర్వహించిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ –– ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించడం ద్వారా ప్రతి వస్తువును అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.
"వైద్య రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక మైలురాయి," అని హరీష్ బాబు వ్యాఖ్యానించారు. "వైద్య పరికరాలపై జీఎస్టీని 18% నుండి 5%కు తగ్గించడం ఆరోగ్య సేవల వ్యయాన్ని గణనీయంగా తగ్గించే చర్య. ఈ నిర్ణయం వల్ల ఆసుపత్రులు తక్కువ ఖర్చుతో ఆధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేయగలుగుతాయి. చివరికి ఈ లాభం నేరుగా ప్రజలకు చేరుతుంది," అని ఆయన వివరించారు.
ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రజల ప్రయోజన పథకాల గురించి ప్రతి పౌరుడూ అవగాహన కలిగి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే సామాజిక బాధ్యత వహించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, శ్రీ సత్యసాయి జిల్లా డీఎంహెచ్‌ఓ డా. ఫైరోజ్ బేగం, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. తిపేంద్ర నాయక్ తో పాటు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Post a Comment