పెన్నహోబిలం బ్యాలెన్స్ రిజర్వాయర్‌కు తక్షణ మరమ్మత్తులు చేపట్టి పూర్తి సామర్థ్యంతో నింపాలి: సీపీఐ డిమాండ్
ఉరవకొండ , అక్టోబర్ 11: పెన్నహోబిలం బ్యాలెన్స్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు తక్షణమే మరమ్మత్తులు చేపట్టి, 11 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నీటితో నింపాలని సీపీఐ జిల్లా బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం పీఏబీఆర్ డ్యామ్‌ను పరిశీలించిన అనంతరం అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శి పి. నారాయణస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా దిగువ ఆయకట్టు రైతులు సాగునీరందక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ బృందంలో జిల్లా సీపీఐ పార్టీ కార్యదర్శి పి. నారాయణస్వామి, జిల్లా సహాయ కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేశవరెడ్డి ఉన్నారు.
రైతులకు తీరని నష్టం:
నారాయణస్వామి మాట్లాడుతూ పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా 49 చెరువులకు నీటిని అందించాల్సి ఉన్నప్పటికీ, డ్యామ్‌కు మరమ్మత్తులు చేయాలనే సాకుతో పూర్తిస్థాయి నీటిని నింపకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని, ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న ఈ డ్యామ్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా దిష్టిబొమ్మగా మిగిలిపోతుందని విమర్శించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలోనే ఈ డ్యామ్ ఉందని, ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని డ్యామ్‌ను పూర్తిస్థాయి నీటితో నింపి, కుడి కాలువ రైతులకు సాగునీరు అందించి చెరువులన్నింటినీ నింపాలని విజ్ఞప్తి చేశారు.
రబీ సాగు, ఆరోగ్యశ్రీపై ఆవేదన:
రబీ సీజన్ ప్రారంభమైనా ఇప్పటివరకు రైతులకు సబ్సిడీ పప్పుశనగ విత్తనాలు అందించకపోవడం శోచనీయమన్నారు. అదేవిధంగా, పేదలకు వరంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులు సేవలను నిలిపివేశాయని, ప్రభుత్వం తక్షణమే బకాయి పడ్డ రూ.2,700 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పీఏబీఆర్ డ్యామ్‌పై పర్యవేక్షణ లోపం:
జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ, పీఏబీఆర్ డ్యామ్‌లో ప్రస్తుతం ఐదు టీఎంసీల నీరు ఉన్నప్పటికీ, విద్యుత్ వినియోగానికి 520 క్యూసెక్కుల నీటిని వాడుకొని దిగువకు విడుదల చేస్తున్నారన్నారు. 11 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన పీఏబీఆర్ డ్యామ్‌ను ఏరోజు కూడా పూర్తిస్థాయిలో నింపలేదని ఆరోపించారు. డ్యామ్‌కు ఉన్న లీకేజీలను మరమ్మత్తులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డ్యామ్‌పై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శించారు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యాన్ని నింపుకునేందుకు భూసేకరణ కూడా జరగలేదన్నారు. కుడి కాలువ మొత్తం శిథిలావస్థకు చేరుకుందని, కాలువకు మరమ్మత్తులు చేయకుండా గాలికి వదిలేశారని ఆరోపించారు. కుడి కాలువ ద్వారా 5 టీఎంసీల నీటిని ఉరవకొండ, రాప్తాడు, సింగనమల, ధర్మవరం నియోజకవర్గాల్లోని 49 చెరువులకు ఇవ్వాలన్న జీవోలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదన్నారు.
ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం:
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని, చెరువులకు, కుడి కాలువకు 5 టీఎంసీలు నీటిని విడుదల చేయకపోతే సీపీఐ పార్టీ రైతుల పక్షాన పోరాటాలకు సిద్ధమవుతుందని మల్లికార్జున హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వంపై విమర్శలు:
జిల్లా సహాయ కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన 57 హామీలలో కేవలం సూపర్ సిక్స్ పథకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందని, అందులో కూడా రైతు భరోసా, వాహన మిత్ర, ఆటో డ్రైవర్లకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సిద్ధాంతాలను తలకెత్తుకున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తి దాడికి పాల్పడటాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రంలోని మతోన్మాద బీజేపీ ప్రధాన వ్యవస్థలన్నింటినీ తన గుప్పెట్లో ఉంచుకొని రాజ్యాంగ విరుద్ధంగా పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ ఉరవకొండ నియోజకవర్గ కార్యదర్శి జె. మల్లికార్జున, కూడేరు మండల కార్యదర్శి నాగేంద్ర, పార్టీ నాయకులు సంగప్ప, రైతు సంఘం నాయకులు రమణ, వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment