మాలాపురం, 11
: అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు మాలాపురంలోని కేజీబీవీ స్కూల్‌లో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని బాలికల ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలికా దినోత్సవం థీమ్ "అమ్మాయి నేను, నేను నడిపించే మార్పు: సంక్షోభం యొక్క ముందు వరుసలో ఉన్న బాలికలు" అని వేణుగోపాల్ తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబరు 11న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ దినోత్సవాన్ని బాలికల హక్కులను రక్షించడానికి, క్షేత్రస్థాయిలో లింగ అసమానతలను తగ్గించడానికి, బాలికలను విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో సాధికారతవంతులను చేయడానికి ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.
బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై (లింగ వివక్ష, విద్యా లోపం, ఆరోగ్య సేవలకు అందకపోవడం, బాల్య వివాహం) అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యమని వేణుగోపాల్ అన్నారు. 2012లో తొలిసారిగా ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని గుర్తించిందని, అప్పటి నుండి ఇది బాలికల హక్కుల కోసం పోరాడేందుకు ఒక ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతోందని ఆయన చెప్పారు. ఇది బాలికల అభివృద్ధికి, తమ సామర్థ్యాన్ని ప్రదర్శించుకునేందుకు ఒక వేదికగా ఉపయోగపడుతుందనీ ఆయన అభిప్రాయపడ్డారు.
బాలికల హక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం, వారి నాయకత్వానికి గుర్తింపు ఇవ్వడం, వివక్షలను తొలగించడం, బాలికలకు ధైర్యాన్ని, సమాన అవకాశాలను పంచడం ఈ దినోత్సవం లక్ష్యాలని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా బాలికలకు విద్య, పోషణ, ఆరోగ్యం, రక్షణ, చట్టపరమైన హక్కులు వంటి అంశాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న వివక్షలను తొలగించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మహిళా సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన, బాలికల భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఈ రోజు ద్వారా కృషి చేయాలని వేణుగోపాల్ ఆకాంక్షించారు. ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం ద్వారా బాలికలకు ప్రపంచవ్యాప్తంగా సమాన హక్కులు, అవకాశాలు కల్పించడానికి, లింగ సమానత్వాన్ని అందించడానికి కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వేణుగోపాల్ తో పాటు సూపర్వైజర్ అమృతలత, హెల్త్ అసిస్టెంట్ నూర్ మహమ్మద్, MLHP శారద, ANM హేమలత, జ్యోతి ఆశా తదితరులు పాల్గొన్నారు.


