రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలలో రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5 వేల భజన మందిరాలు నిర్మాణం.
ఈ నెల 27వ తేదీన అమరావతిలోని ఎస్వీ ఆలయం విస్తరణ పనులు
శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు*
డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్*
తిరుమల, 2025 నవంబరు 07: శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగప్రదక్షిణం టోకెన్ల జారీ కొరకు గతంలో ఉన్న డిప్ విధానం కాకుండా ఆన్‌లైన్ లో ముందు వచ్చిన వారికి ముందు అను పద్ధతిలో వచ్చే ఫిబ్రవరి నుండి ఆన్‌లైన్ కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి….
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం.
భక్తుల సౌకర్యార్థం దాదాపు రూ.25 కోట్లతో తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుండి గోగర్భం డ్యాం సర్కిల్ వరకు Permanant Shelter, Q lines, Steel foot over bridges మరియు Toilets నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం.
భక్తుల సూచనలు మేరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించి శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్లు జారీ చేసే విధానంపై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు టీటీడీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
తిరుమల అటవీ ప్రాంతంలో రానున్న 10 సంవత్సరాలలో జీవవైవిద్యాన్ని కాపాడేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం.
టిటిడి ఆలయాలలోని ఆయా ప్రాంతాలలో భక్తుల రద్దీకి తగ్గట్లుగా అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ ప్రాకారము, కల్యాణోత్సవ మండపం, రాజగోపురం తదితర అభివృద్ధి పనులు ఈనెల 27వ తేదీ నుండి ప్రారంభమవుతాయి.
శ్రీవారి దర్శనానికి దళారులను నమ్మి మోసపోయిన్నట్లు ఇటీవల హైదరాబాద్‌కు చెందిన కొందరు భక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి ఫిర్యాదులు తరచు వస్తున్నాయి. కావున భక్తులు శ్రీవారి దర్శనానికి దళారుల మాటలు విని మోసపోవద్దని, ఆన్‌లైన్ ద్వారానే దర్శన టోకెన్లు పొందాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి.మురళీకృష్ణ, సిఇ శ్రీ టి.వి. సత్యనారాయణ మరియు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Comments
Post a Comment