![]() |
| రాష్ట్ర ఆర్థిక మంత్రికి గురువందనం: పయ్యావుల కేశవ్‌కు గురువు ఆశీస్సులు! |
పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురు భక్తిని చాటుకున్నారు. పవిత్ర ఆధ్యాత్మిక పట్టణమైన పుట్టపర్తిలో నివాసముంటున్న తన బాల్య గురువు, రిటైర్డ్ ఉపాధ్యాయులు గంగాధర శాస్త్రి గారిని ఆయన ఆత్మీయంగా కలుసుకున్నారు.
శాంతి నిలయంలో గురువు గారితో అనుబంధాన్ని పంచుకున్న మంత్రి కేశవ్, సాష్టాంగ నమస్కారం చేసి, కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
గురువు గారి భావోద్వేగం: "రాష్ట్రం గర్వించదగిన నాయకుడివి"
తన శిష్యుడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఎదిగిన తీరును చూసి ఉపాధ్యాయులు గంగాధర శాస్త్రి గారు అమితానందం వ్యక్తం చేశారు. "ఏం నాయనా.. బాగున్నావా... రాష్ట్రం గర్వించదగిన నాయకుడు అయ్యావు సంతోషం" అని అభినందించారు. తన వద్ద విద్యాభ్యాసం నేర్చుకున్న విద్యార్థి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగుచేసే ఆర్థికవేత్త అవుతాడని ఊహించలేదని చెబుతూ గంగాధర శాస్త్రి గారు భావోద్వేగానికి లోనయ్యారు.
మంత్రి కేశవ్: ఈ రోజు నాకు అమితానందం
గురువును కలిసిన సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ కూడా తన బాల్య అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "ఈ మధ్యకాలంలో నాకు అమితానందం కలిగించిన దినం తన గురువును కలవడమే" అని పేర్కొంటూ, విద్యార్థి దశలో గంగాధర శాస్త్రి గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఉపాధ్యాయుడి పట్ల శిష్యుడికి ఉన్న గౌరవాన్ని, శిష్యుడి ఎదుగుదలను చూసి గురువు పొంగిపోయిన ఈ అపూర్వ కలయిక పుట్టపర్తిలో చోటుచేసుకుంది.

Comments
Post a Comment