నేడే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
సాంప్రదాయ మత్స్యకారులు ప్రతి సంవత్సరం నవంబర్ 21 న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని,జరుపుకుంటూనే ఉన్నారు,తమ సమస్యలను ఏకరవు పెడుతూనే ఉన్నారు,కానీ ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉన్నదని బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కేవి ఆందోళన వ్యక్తం చేశారు
ముఖ్యంగా మైదాన ప్రాంత మత్స్య కార్మికులు రాయలసీమ ప్రాంతంలో ప్రాథమిక మత్స్యకార సహకార సంఘాల పై ఆధారపడి చేపల వేటను సాగిస్తూ బ్రతుకుతున్నారు. మత్స్య సహకార సంఘాలలో సమస్యలు పేరుకుపోయి, కేవలం ఉద్యోగుల కోసమే అన్నట్లుగా మారిపోయి, మత్స్య కార్మికులకు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి.
ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రభుత్వాలు గంగపుత్రుల సమస్యలను పరిష్కారం చేస్తామన్న మాటలు కోటలు దాటుతున్నాయే గాని ఆచరణ గడప దాటడం లేదు.
సాంప్రదాయ మత్స్యకారులు రాయలసీమ ప్రాంతంలో ప్రాథమిక మత్స్య సహకార సంఘాల పై ఆధారపడి బ్రతుకుదామ నుకుంటే ఆ సంఘాలు పెత్తందారుల చేతుల్లోకి వెళ్లిపోయిన కారణంగా సాంప్రదాయ మత్స్యకారులు రోజువారి కూలీలుగా బ్రతికే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి.
తాము పస్తులుండి ప్రభుత్వాలకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న సాంప్రదాయ మత్స్యకారులను గురించి ఈ ప్రభుత్వాలు ఆలోచించడం లేదు,కనీస గౌరవం లేదు, అంటరానితనంతో అలమటిస్తున్నారు.
సముద్ర తీర ప్రాంతాలలో వేట నిషేధం కాలములో మత్స్యకార భరోసా ఇస్తున్న ప్రభుత్వం,మైదాన ప్రాంతంలో చెరువులు,నదులు, ప్రాజెక్టులలో వేట సాగిస్తూ మత్స్య సహకార సంఘాల పై ఆధారపడిన సాంప్రదాయ మత్స్యకారులకు"మత్స్యకార నేస్తం"ప్రత్యేక పింఛన్లు, సబ్సిడీ రుణాలు, ఫిష్ మాల్ట్ ఏర్పాటు చేసుకోవడానికి గ్రామ మున్సిపాలిటీలలో స్థలాలు, గదుల కేటాయింపులు, ప్రాసెసింగ్ యూనిట్లు,ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు,మత్స్య సహకార సంఘాలకు, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ కో- ఆపరేటివ్ ఫెడరేషన్(ఆప్ కాఫ్) సంస్థలకు అధ్యక్షులుగా సాంప్రదాయ మత్స్యకారులను నామినేట్ చేసే జీవో తీసుకువచ్చి,వారి పిల్లలకు ఉచిత విద్య,వైద్య సౌకర్యాల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టకపోతే ఇప్పటికే వలస బాట పట్టిన సాంప్రదాయ మత్స్యకారులు ఎటుపోవాలో దిక్కుతోని పరిస్థితులలో ఆత్మహత్యలు,ఆకలిచావులకు గురికాక తప్పదు.ప్రపంచ మత్స్య కారుల దినోత్సవానికి అర్థం ఉండదు.కావున ఈ ప్రపంచ మత్స్య కారుల దినోత్సవం సందర్భంగా నైనా మంచి నిర్ణయాలు తీసుకుంటారని,తద్వారా మంచి రోజులు వస్తాయని .కెవి రమణ,జిల్లాఅధ్యక్షులు,బెస్త సేవా సంఘం,ఆశా భావం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment