![]() |
| సిపిఐ రాష్ట్ర నాయకుడు జగదీష్ నారా లోకేష్ ని కోరారు — 💧 “హద్రినీవా నీటిని మళ్లించండి... రైతుల జీవితాలు మార్చండి!” |
రాయలసీమ రైతుల కేక వినిపిస్తుందా?
రాయదుర్గం : రాయలసీమ ప్రాంతంలో బీడు భూములను సాగు భూములుగా మార్చాలని, భూమిని నమ్ముకున్న రైతులను కాపాడాలని సిపిఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ నారా లోకేష్ కి బహిరంగ విన్నపం చేశారు.
రాయదుర్గం పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, గత 15 సంవత్సరాలుగా హద్రినీవా ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీటిని సక్రమంగా వినియోగించుకునే స్థితి రాలేదని తెలిపారు. కాలువలను వెడల్పు చేసినందున ఇప్పుడు నీటి సామర్థ్యం పెరిగిందని, ఈ నీటిని బీడు భూములకు మళ్లించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 లక్షల 50 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందిస్తే ఈ ప్రాంత ప్రజల జీవన విధానం మారిపోతుంది,” అని జగదీష్ పేర్కొన్నారు.
వర్షాభావం, కరువు తీవ్రంగా ప్రభావితమైన రాయలసీమ జిల్లాలకు హద్రినీవా నీటిని మళ్లించే దిశగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రైతుల పంట ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు అనంతపురంలో ఏర్పాటు చేయాలని వాగ్దానం చేసిన కార్గో విమానాశ్రయం పనులు పూర్తి చేయాలని కూడా సిపిఐ డిమాండ్ చేసింది.
జగదీష్ మాట్లాడుతూ, “హెచ్.ఎల్.సి. ద్వారా 32.5 టీఎంసీలు రావాల్సి ఉన్నా కాల్వ విస్తీర్ణం తక్కువగా ఉండటం వల్ల నీరు వినియోగించుకోలేకపోతున్నాం. కర్ణాటక నుంచి ఐదు టీఎంసీలు వస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు, అన్నారు.
రాయలసీమ ప్రాంత ప్రజల జీవనోపాధిని కాపాడాలంటే, నీటి మళ్లింపులు, కాలువల విస్తరణ, సాగు నీరు అందించే ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకోవాలని సిపిఐ కోరింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు గోపాల్, నాగార్జున, రాజేష్, ఏఐఎస్ఎఫ్–ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంతరాయుడు, కోట్రెష్, రైతు సంఘం నాయకులు నర్సింలు, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment