గంగ పుత్రుల మధ్య *కూటమి చిచ్చు అక్కున చేర్చుకున్న వైసిపి!

Malapati
0



 

    ఆర్థికంగా,సామాజికంగా, రాజకీయంగా బక్క చిక్కి మూలబడిన గంగపుత్రులను ఆదుకుని,అక్కున చేర్చుకోమని 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబును విన్నవించుకోవడానికి వెళితే తోలుతీస్తా,తొక్క తీస్తానని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

     2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గంగపుత్రులను అగ్ర భాగాన నిలబెట్టి అక్కున చేర్చుకున్నాడు.ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా గంగపుత్రులకు మూడు ఎమ్మెల్యేలు,ఒక రాజ్యసభ, ఒక మంత్రి,రాయలసీమ నుండి ఇద్దరు,కోస్తా నుండి ఒకరు, ఉత్తరాంధ్ర నుండి ఒకరు చొప్పున ఎమ్మెల్సీలను చేసి చట్టసభలకు పంపాడు. గంగపుత్ర ముద్దుబిడ్డ కోలా గురువులు ఎమ్మెల్సీగా ఓడిపోతే విశాఖపట్నం జిల్లా సహకార కేంద్రం బ్యాంకు చైర్మన్ గా చేయడంతో పాటు వైసిపి జిల్లా అధ్యక్షునిగా నియమించి గౌరవించాడు.

    చరిత్రలో మొట్టమొదటిసారి గంగ పుత్రులకు నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నలుగురు చైర్మన్ లు, 72 మంది రాష్ట్రస్థాయి డైరెక్టర్లను చేసి రాజకీయ గుర్తింపు తెచ్చాడు.

     సముద్రతీర ప్రాంతాలలో ప్రాణాలకు తెగించి,చేపలు వేటాడి, మత్స్య సంపదను సృష్టిస్తున్న మత్స్యకారుడికి వేట నిషేధ సమయంలో అప్పటివరకు ఇస్తున్న మత్స్యకార భరోసా 4000 రూపాయలను 10000 రూపాయలకు పెంచి, అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచినే అర్హులందరికీ అందించాడు.కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోలో మత్స్యకార భరోసా రెట్టింపు చేసి 20వేల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టి,మత్స్యకారుల ఉసురు తీసింది.వైసీపీ ప్రభుత్వం ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారునికి అప్పటివరకు ఇస్తున్న ఐదు లక్షల రూపాయలను 10 లక్షల పెంచి ఇచ్చింది.డీజిల్ సబ్సిడీ ఆరు రూపాయల నుండి తొమ్మిది రూపాయలకు పెంచింది, కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే సుమారు *లక్షా 35 వేల మంది మత్స్యకారులకు 450 కోట్లు ఖర్చు చేసింది*.

     మత్స్యకారుల అభివృద్ధికి *ఫిష్ ఆంధ్ర ఫిట్ ఆంధ్ర* లో భాగంగా 9 ఫిషింగ్ హార్బర్లు,నాలుగు ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు,మత్స్య యూనివర్సిటీ,ప్రతి నియోజకవ వర్గ కేంద్రంలో ఫిష్ హబ్,సెంటు స్థలం ఉంటే 10 లక్షలతో ఫిష్ మాల్ ఏర్పాటు, తద్వారా ఫిష్ మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు అభివృద్ధి చేశారు.

     చంద్రబాబు పాలనలో చిన్నాభిన్నమైన ఆక్వారంగాన్ని గాడిలో పెట్టడానికి ఆక్వా రైతులకు ఇస్తున్న కరెంటు ఛార్జ్ సబ్సిడీ యూనిట్ మూడు రూపాయలు నుండి ఒకటిన్నర రూపాయలు తగ్గించడం ద్వారా సుమారు 2700 కోట్లు చెల్లించారు,ఇది కాకుండా అదనంగా అప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం లో ఉన్న బకాయిలను కూడా చెల్లించారు.

    మత్స్య రంగానికి సంబంధించి అన్ని అంశాలలో ఏపీని భారత ప్రభుత్వం 2021లో ఉత్తమ రాష్ట్రంగా గుర్తించి,ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 12న బహుమతి ప్రధానం కూడా చేసింది. మత్స్య ఉత్పత్తులలో దేశంలోనే రాష్ట్రం 30 శాతం వాటాకు ఎదిగింది.స్థూల విలువ జోడింపులో 2014-15 లో 4.6 శాతం ఉన్న వాటా 2020-21 లో 9 శాతం అభివృద్ధి చెందింది.2014-15 లో 19.78 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న మత్స్య ఉత్పత్తులు,2021-22లో ఏకంగా 48.13 టన్నులకు చేరుకుంది.ఇవి అభూత కల్పనలు కావు, ఎవరైనా ఎప్పుడైనా మత్స్య రంగ వెబ్సైట్లో చూసుకోవచ్చు.ఒక జాతి కనుమరుగు కాకుండా ఉండడానికి ప్రభుత్వాలు ఇంతకంటే ఏమి చేయగలవు. ఐదు సంవత్సరముల కాలం లోనే ఒక జాతికి ఇంత మేలు జరిగిందంటే,అదే ప్రభుత్వం నేడు కొనసాగి ఉంటే ఇంకెంత మేలు జరిగి ఉండేదని గంగపుత్రులు తలుచు కుంటున్నారు.

     నేడు కూటమి ప్రభుత్వం గంగ పుత్రులకు తగినంత న్యాయం చేయకపోగా గొంతులలోతు కష్టాలలో కూరుకుపోయిన గంగపుత్రులను *మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు* ఆఫ్కాబ్ ఎన్నికల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గంగ పుత్రులను అడ్డంగా చీల్చి,ఐకమత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది. 

      గత వైసిపి ప్రభుత్వం రాయలసీమలో గణనీయమైన జనాభా కలిగి గంగపుత్ర ఉపకులమైన *బెస్త జాతి* కను మరుగైపోతున్న విషయాన్ని గమనించి చరిత్రలోనే మొట్టమొదటగా

*బెస్త కార్పొరేషన్* ఏర్పాటుచేసి ఈ రాష్ట్రంలో *బెస్త కులం* అంటూ ఒకటి ఉన్నదని బయటి ప్రపంచానికి తెలియజేసింది.అదే కులానికి చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు.అయితే నేడు కూటమి ప్రభుత్వం కొల్లేరు తీర ప్రాంతంలో బెస్తలు లేరన్న విషయం తెలిసి *నకిలీ కుల ధ్రువీకరణ పత్రాన్ని* పొందిన *పట్టపు కులానికి* చెందిన వ్యక్తికి బెస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టి బెస్తల ను అవమానించింది. రాష్ట్రవ్యాప్తంగా బెస్తలు ఇది తప్పు అని చెప్పినా ఖాతరు చేయలేదు.

      ఆప్కాబ్ చైర్మన్ పదవి *ఎలక్షనా,సెలక్షనా* అనే పరిజ్ఞానం కూడా లేకుండా, మత్స్య శాఖ పట్ల ఏమాత్రం అవగాహన లేని కింజారపు అచ్చం నాయుడు గారికి ఆ శాఖను కేటాయించడం వల్ల ఆగమేఘాల మీద కొల్లు పెద్దిరాజును ఆఫ్కాబ్ కు చైర్మన్ గా నియమిస్తున్నట్లు ప్రకటించేసారు.ఆ తరువాత అది సెలక్షన్ కాదు ఎలక్షన్ అని నాలుక కర్చుకుని వెంటనే రద్దుచేసి,అతనిని సంతృప్తి పరచడం కోసం అతని కులానికి సంబంధం లేని అంటే *అగ్నికుల క్షత్రియ* కులానికి సంబంధం లేని *మత్స్యకార కార్పొరేషన్* కు చైర్మన్ గా నియమించారు. మత్స్యకార కార్పొరేషన్ లో సభ్యత్వం కలిగిన కులాలు వాడబలిజ, జాలరి,నెయ్యల,పట్టపు,గూండ్ల,వీరెవ్వరికీ అందులో అవకాశం ఇవ్వలేదు. ఎటువంటి సంబంధం లేని అగ్నికుల క్షత్రియ కులానికి కట్టబెట్టి మత్స్యకార కులాలకు తీవ్రమైన అన్యాయం చేశారు.

     ఆప్కాబ్ చైర్మన్ గా కడపకు చెందిన రాంప్రసాద్ పేరు ప్రకటించి నప్పుడు, చాలాకాలం తర్వాత రాయలసీమ బెస్తలకు ఆప్కాఫ్ చైర్మన్ పదవి దక్కుతుందని సంతోషపడ్డారు. ఆ తరువాత అచ్చం నాయుడు,కొల్లు రవీంద్ర గారి వర్గపోరుతో ఇద్దరు రాయలసీమ బెస్తల మధ్య అగ్గి రగిలించారు. కొల్లు రవీంద్ర రాంప్రసాద్ పేరు,అచ్చన్న నవీన్ కుమార్ పేరు ప్రతిపాదించారు.ఇది గమనించిన కొల్లు తన వర్గీయులతో కోర్టు ద్వారా ఎన్నికల ఆదేశాలను తీసుకువచ్చారు.అది తెలుసుకున్న అచ్చం నాయుడు కోపోద్రిక్తుడై ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో చూస్తానని *నా పుట్టలో వేలు పెడితే కుట్టనా* అన్నట్లు నా శాఖలో నీ పెత్తనం ఏంటని చంద్రబాబు గారి ద్వారా వాయిదా వేయించాడు.దీనికి తగ్గట్టుగా మత్స్య శాఖలో ఏమాత్రం అవగాహన లేని కమీషనర్ ను నియమించడం మరో మెలిక.ఇందులో *అచ్చన్న వైపున చంద్రబాబు,కొల్లు వైపున లోకేష్* నిలబడడం కొసమెరుపు.ఇందులో గేమ్ చేంజర్ ఎవరో తెలియదు.ఆఫ్ కాఫ్ చైర్మన్ పదవి బెస్తలకు ఎవరికి వచ్చినా రాయలసీమ బెస్తలు సంతోష పడతారు. కానీ ఈ తంతు నిజంగా బెస్తలకు ఆప్కాబ్ చైర్మన్ పదవిని కట్టబెట్టడానికి కాదు. ఆప్కాఫ్ కు జాతీయ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ సి డీసీ) ద్వారా మత్స్య సహకార సంఘాలను 182 (ఎఫ్ ఎఫ్ సి వో )లుగా అభివృద్ధి చేయడం కోసం 1274 కోట్ల రూపాయలు మంజూరు అయింది, అందులో 637 కోట్లు విడుదల చేశారు, ఈ స్కీం అభివృద్ధి చేయడం కోసం ఇప్పటికే 50 మంది తమకు కావాల్సిన వారిని నియమించుకొని ఒక్కొ క్కరికి నెలకు లక్ష రూపాయలు చొప్పున జీతం ఇస్తూ నియమించుకొన్నారు. దీనిని బట్టి వీరి వర్గ పోరు ఈ నిధులపై పెత్తనం కోసమేనని,ఇది ఏమాత్రం గంగపుత్రులను ఆర్థికంగా, సామాజికంగా ఆదుకోవడం కోసం కాదని రుజువయింది. 

 ‌ ఈ తంతు అంతా ఇప్పటికే అనైక్యతతో, బలహీనంగా ఉన్న రాయలసీమ బెస్తలను అడ్డంగా చీల్చి,మరింత బలహీన పరచడమే.

    ‌ ఇదంతా గమనిస్తున్న రాయలసీమ బెస్తలు ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన మమ్ములను రాజకీయ,సామాజిక,ఆర్థికంగా ఆదుకోకపోయినా పరవాలేదు మా మధ్య తగాదాలు పెట్టొద్దని,ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో బెస్తలు ఐక్యమై కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!