జైపూర్:
దరఖాస్తుదారుల్లో ఇంజినీరింగ్,ఎంబిఎ,పిహెచ్‌డి,పిజి అభ్యర్థులు కూడా బిజెపి పాలిత రాజస్థాన్‌లో నిరుద్యోగతాండవ
జైపూర్ : దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. చదువుకు తగిన జాబ్ రాకపోవడంతో ఏదో ఒక జాబ్‌లో సెటిలవ్వాలన్న ధోరణిలోకి వచ్చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలోని మోడీ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్లు వస్తే.. rajasఉద్దరిస్తామంటూ సమస్యల్ని పట్టించుకోవటంలేదనటానికి ఉదాహరణలు ఎన్నో. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలుఉన్నా భర్తీచేయటంలేదు. నిరుద్యోగం ఎంతగా ప్రబలుతున్నదో చెప్పటానికి బిజెపి పాలిత రాజస్థాన్‌లో ఇటీవల ప్యూన్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌నే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తం 53,479 ప్యూన్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా 24.76 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు పదో తరగతి అర్హత కాగా.. దరఖాస్తు చేసుకున్నవారిలో డిగ్రీ/బిటెక్, ఎంఎస్‌సి, ఎంబిఎ, లా, పిహెచ్‌డి చేసిన వాళ్లూ పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. ప్యూన్ పోస్టుల కోసం సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని పలువురు కామెంట్లు పెడుతున్నారు. కాగా, దీనిపై పలువురు ఉద్యోగార్థులు స్పందించారు. 2018 నుంచి పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నా. ఇంకా సక్సెస్ కాలేకపోయాను. కనీసం ప్యూన్ జాబ్ వచ్చినా కూడా నిరుద్యోగిగా ఉండే బాధ తప్పుతుందని జైపూర్‌లోని గోపాలపుర ప్రాంతంలో కోచింగ్ తీసుకుంటున్న కమల్ కిశోర్ తెలిపారు. తాను ఎంఎ, బిఇడి పూర్తి చేశానని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ఉద్యోగం రావడం అంటే జీవితానికి భద్రత అన్నట్లే.. ప్యూన్‌గా నీళ్లు ఇవ్వడమైనా సరే.. ఏ అవకాశాన్ని కోల్పోవద్దని భావించామని పీజీ పూర్తి చేసిన తనూజా యాదవ్, ఎంఎ, బిఇడి పూర్తి చేసిన సుమిత్రా చౌదరి అభిప్రాయపడ్డారు.
కాగా, ప్యూన్ పోస్టుల కోసం చివరి ఐదు గంటల్లోనే దాదాపు 1.11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ప్రతి ఆరు సెకన్లకు ఒక అప్లికేషన్ నమోదైంది. ఇంత భారీ ట్రాఫిక్ కారణంగా సైట్ తరచూ క్రాష్ అయ్యింది. దీనివల్ల అప్లికేషన్ ప్రక్రియలో పలువురు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. కొందరి డాక్యుమెంట్లు అప్‌లోడ్ కాలేవు. దీంతో అప్లికేషన్ గడువును పొడిగించాలని పలువురు నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వేడుకుంటున్నారు. చిన్న చిన్న పోస్టులకు లక్షల్లో దరఖాస్తులు రావడం రాజస్థాన్‌లో ఇదే తొలిసారి ఏమీ కాదు. గతంలో 2399 ఫారెస్ట్ గార్డు పోస్టుల కోసం దాదాపు 22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రాజస్థాన్‌లో అధికారిక లెక్కల ప్రకారం 18 లక్షల నిరుద్యోగులు రిజిస్టరయ్యారు. అయితే మొత్తం నిరుద్యోగుల సంఖ్య 35 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

Comments
Post a Comment