గుజరాత్: అహ్మదాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నగర పోలీస్ కంట్రోల్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా విధులు నిర్వహిస్తున్న వన్‌రాజ్ మంజరియా రేబిస్ బారిన పడి మృతి చెందారు.
వివరాల ప్రకారం, వన్‌రాజ్ మంజరియా తన నివాసంలో ఒక పెంపుడు కుక్కను పెంచుతూ వచ్చారు. ఇటీవల ఆ కుక్క ఆయన చేతిపై గీకింది. సాధారణ గాయం అని భావించిన ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లు సమాచారం. అయితే కొన్ని రోజులకే ఆరోగ్య సమస్యలు వేధించడంతో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించిన తర్వాత ఆయన రేబిస్ బారిన పడ్డారని నిర్ధారించారు. ఆ రోజు నుంచే చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో వన్‌రాజ్ మంజరియా చివరికి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అహ్మదాబాద్ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. సహచరులు ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నారు.
వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, కుక్క, పిల్లి, కోతి వంటి జంతువులు కరిచినప్పుడు లేదా గీసినప్పుడు వెంటనే ఆ గాయాన్ని నీటితో బాగా కడిగి, తక్షణమే యాంటీ రేబిస్ ఇంజెక్షన్ తీసుకోవాలి. రేబిస్ బారిన పడిన తర్వాత చికిత్స పొందడం చాలా క్లిష్టమని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటన ప్రజల్లోనూ అవగాహన కలిగించింది. చిన్న గాయమని నిర్లక్ష్యం చేస్తే ఎంతటి ప్రాణహాని కలగవచ్చో వన్‌రాజ్ మంజరియా ఘటన మళ్లీ రుజువు చేసింది.

Comments
Post a Comment