ఉరవకొండ ఆసుపత్రిలో బాలుడి మృతి.. అధికారుల విచారణ
September 26, 2025
0
ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాద ఘటన కలకలం రేపింది. వజ్రకరూర్ మండలం చాబాల గ్రామానికి చెందిన ఐదేళ్ల ఆహరన్ జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు మంగళవారం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, విధి నిర్వహణలో ఉన్న వైద్యుడు సమయానికి హాజరుకాకపోవడంతో చికిత్స ఆలస్యం అయ్యిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ లోగా బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. జిల్లా DCHS డేవిడ్ సెల్వన్ రాజు ఆసుపత్రికి చేరుకుని సిబ్బందిని ప్రశ్నించారు. తల్లిదండ్రుల వాంగ్మూలం, ఆసుపత్రి రికార్డులు, డ్యూటీ షెడ్యూల్ వంటి అంశాలను సమీక్షించారు. బాధ్యతారహిత వైఖరి ఉన్నట్లయితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
బాలుడి మృతి పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రిలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడం విచారకరమని వారు మండిపడుతున్నారు.
