హైదరాబాద్ : హైదరాబాద్‌లో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి, “ఆడబిడ్డలను మన సంతోషాల్లో భాగస్వాములను చేసినప్పుడే ఈ పండుగ నిండుదనం సంతరించుకుంటుంది” అని పేర్కొన్నారు. బతుకమ్మ కుంట కోసం జీవితాంతం పోరాడిన వి. హనుమంతరావును స్మరించుతూ ఆయనకు గౌరవప్రదమైన నివాళులు అర్పించారు.
హైడ్రా ఏర్పాటు సమయంలో ఎదురైన వివాదాలు, విమర్శలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి, “ఒడిదుడుకులు వచ్చినపుడు సమయస్ఫూర్తితో పరిష్కారాలు కనుగొంటూ ముందుకు సాగాలి” అని అన్నారు. కోవిడ్ తరువాత వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రస్తుతం కుంభవృష్టి వర్షాలు ఒకేసారి కురుస్తున్నాయని తెలిపారు. “మన వ్యవస్థ కేవలం రెండు సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునేలా ఉన్నప్పటికీ, ఇప్పుడు విపరీత వర్షాలను ఎదుర్కొనేలా పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల ప్రణాళికలు సిద్ధం చేశాం” అని ముఖ్యమంత్రి వివరించారు.
మూసీ పునరుజ్జీవనమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “ఒకప్పుడు జీవధారగా ఉన్న మూసీ ఇప్పుడు మురికికూపంగా మారింది. చెరువులను విడిపించడం, నాలాలను విస్తరించడం, మూసీకి పునర్జీవం ఇవ్వడం కోసం కృషి చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ కృషిలో భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.
అంబర్‌పేట పరివాహక ప్రాంతాల్లో పేదల సమస్యలను ప్రస్తావిస్తూ, వారికి పునరావాసం కల్పించే దిశగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. “పేదరికం విలువ నాకు తెలుసు. మాది ప్రజా ప్రభుత్వం. పేదలెవరినీ మేం కష్టపెట్టం, వారికి అండగా నిలుస్తాం” అని ధైర్యం ఇచ్చారు.
స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచన మేరకు బతుకమ్మ కుంటకు వి. హనుమంతరావు పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. “హనుమంతరావు సూచనలతోనే ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మార్చాం. భవిష్యత్తులో కూడా ఆయన సలహాలను గౌరవిస్తాం” అని తెలిపారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


Comments
Post a Comment