కర్నూల్ జిల్లా: ఉల్లి రైతులకు కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.3 వేలు కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉల్లి రైతులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. ఎకరాకు 20000 ప్రకటించి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకటించినటువంటి హెక్టార్కు రూ 50 వేలు రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి కూడా సరిపోవన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. సోమవారం కర్నూల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సందర్శించారు. ఆయనతోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ , సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, పి నిర్మల, ఎండి ఆనంద్ బాబు, ఎండి అంజిబాబు, కె.వి నారాయణ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ లు ఉన్నారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు ఉల్లి రైతులతో మాట్లాడారు .ఉల్లి పంటలు సాగు చేసేందుకు దాదాపుగా లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సాయం ఏ మూలకు సరిపోదని ఆయనకు వివరించారు. ఇప్పుడు మార్కెట్ కు తెచ్చిన ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ప్రకటించడం దుర్మార్గమన్నారు. అక్కడే ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి, టమోటా, పొగాకు సాగుచేసిన రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. ఎన్నికల హామీలు రైతులకు అమలు చేయరా అన్నారు. రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్న ప్రకటణ ఎక్కడ ఆచరణకు నోచుకోలేదన్నారు. ఉల్లిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి, ఇప్పుదు హెక్టార్ కు రూ 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం వ్యాపారస్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటా రూ 3 వేలు లాగా మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రైతులు పండించినటువంటి ఉల్లిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలన్నారు. రాష్ట్రంలోని కోటి మంది రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లిని అంద చేయాలని డిమాండ్ చేశారు. మేకిన్ ఇండియా పేరుతో నరేంద్ర మోడీ మోసగిస్తున్నారన్నారు. అమెరికా ఆస్ట్రేలియా నుండి పత్తి, డైరీ ఉత్పత్తులు మొక్కజొన్న ఇతర పంటలను ఎలాంటి పన్నులు లేకుండా దిగుమతి చేసుకుంటున్నారన్నారు. మనదేశంలో పండించిన పంట ఉత్పత్తులపై అమెరికాలో అధిక సుంకాలను విధిస్తున్న మోడీ ఏమి అనకపోవడం దుర్మార్గమన్నారు. రైతులను ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు. అనంతరం మార్కెట్లో ఏర్పాటుచేస్తూ ఏడు సంవత్సరాలుగా నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన ఏసీ గోడౌన్లను పరిశీలించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గురు శేఖర్, నగేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు సాయి ఉదయ్ రంగప్ప డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా నాయకులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment