కావలి ఎమ్మెల్యేను సైబర్ నేరగాళ్లు బలి చేసుకున్నారు
September 26, 2025
0
సైబర్ మోసగాళ్ల బారిన సామాన్యులు మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా చిక్కుకుంటున్నారు. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి సైబర్ నేరగాళ్లకు గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 22న ఎమ్మెల్యే వ్యక్తిగత వాట్సప్ నంబర్‌కు ఆర్టీఏ బకాయిలు చెల్లించాలంటూ ఓ లింకు వచ్చింది. తన కంపెనీ వాహనాలకు సంబంధించిన బకాయిలుగా భావించిన ఆయన ఆ లింక్‌పై క్లిక్ చేశారు. వెంటనే ఆయన సిమ్ బ్లాక్ అయ్యింది. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఆధార్ విజిలెన్స్ విభాగం దృష్టికి తీసుకెళ్లారు. 25 రోజుల తరువాత సిమ్ మళ్లీ యాక్టివ్ అయింది.
అయితే, ఆ కాలంలోనే ఎమ్మెల్యేకు చెందిన రెండు యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి యూపీఐ లావాదేవీల రూపంలో మొత్తంగా రూ.23,16,009 నగదు మాయం అయినట్లు కంపెనీ సిబ్బంది గమనించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 16 వరకు దశల వారీగా డబ్బు డెబిట్ అయినట్లు ఆలస్యంగా తెలిసింది.
దీంతో అసలు విషయం బయటపడింది. సైబర్ నేరగాళ్లు ఈ దందా వెనుక ఉన్నారని గ్రహించిన ఎమ్మెల్యే, వెంటనే కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ప్రజాప్రతినిధులు సైతం ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తుచేస్తోంది.
Tags
