ఉరవకొండ : ఉరవకొండ గ్రామ పంచాయతీలో నూతనంగా కూరగాయల మార్కెట్ (వెజిటేబుల్ మార్కెట్) ఏర్పాటుకు సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి శ్రీ పయ్యావుల కేశవ మరియు వారి సోదరులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాల మేరకు, ఉరవకొండకు చెందిన ప్రతినిధుల బృందం తాడిపత్రిలోని కూరగాయల మార్కెట్‌ను ఈరోజు పరిశీలించింది.
గత 25 సంవత్సరాలుగా ఉరవకొండలో శాశ్వత కూరగాయల మార్కెట్ లేని లోటును దృష్టిలో ఉంచుకుని, నూతన మార్కెట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఈ పరిశీలన జరిగింది. తాడిపత్రి మార్కెట్ నిర్మాణం, సౌకర్యాలు, నిర్వహణ వంటి అంశాలను బృందం అధ్యయనం చేసింది. తాడిపత్రి మార్కెట్ నమూనాను, అక్కడి స్థల వినియోగాన్ని పరిశీలించి, ఉరవకొండలో చేపట్టబోయే మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలో ఉపయోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
గ్రామ పంచాయతీకి 25 ఏళ్ల కల: ఉరవకొండ గ్రామస్తులకు మరియు వ్యాపారులకు గత రెండున్నర దశాబ్దాలుగా కూరగాయల మార్కెట్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. దీనిని పరిష్కరించడానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. నూతన మార్కెట్ ఏర్పాటుతో స్థానిక రైతులకు, చిరు వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు లభించడంతో పాటు, ప్రజలకు కూడా పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు కొనుగోలు చేసే అవకాశం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం అవుతోంది.
నూతన వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని స్థానిక నాయకులు తెలిపారు.
Comments
Post a Comment