అమరావతి, అక్టోబర్ 24:
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) మరియు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ (RGSA) కింద కేంద్రం మొత్తం రూ.715 కోట్లు మంజూరు చేసింది.
ఉపాధి హామీ బకాయిల చెల్లింపునకు మార్గం సుగమం:
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ.665 కోట్లను విడుదల చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.166 కోట్లను జత చేసింది. దీంతో మొత్తం రూ.831 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిధులతో 2025, మార్చి 31వ తేదీ నాటికి ఉన్న పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించేందుకు వెసులుబాటు కలుగుతుంది.
పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రూ.83
కోట్లు:
రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డుల కంప్యూటరీకరణ, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులకు శిక్షణ వంటి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం 'రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్' (RGSA) పథకం ద్వారా రూ.50 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు కలపనుంది.
కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు:
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ల నాయకత్వంలో రాష్ట్రానికి నిధులు విడుదల కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులు రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి, ఉపాధి హామీ పనుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

Comments
Post a Comment