ఉరవకొండ, అక్టోబర్
24: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళిత, గిరిజనులపై దాడులు, హత్యలు పెరిగిపోయాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బి. మోహన్ నాయక్ ఆరోపించారు. దాడులను వెంటనే అరికట్టి, బాధితులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
శుక్రవారం ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థినులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు రక్షణ కరువైందని, వారిపై రోజురోజుకు పెరుగుతున్న హింస ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ వర్గాల ప్రజల భద్రతను నిర్ధారించాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తుచేశారు.
ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకొని దాడులు, హత్యలను అరికట్టాలని, లేనిపక్షంలో దళిత, గిరిజనులు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు మహాలక్ష్మి, ధనలక్ష్మి, రాజేశ్వరి, సావిత్రి, భార్గవి, అశ్విని, గౌతమి, మానస, తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment