సాలూరు: జాతీయ షెడ్యూల్డు తెగల చైర్ పర్సన్ అంతర్ సింగ్ ఆర్యను రాష్ట్రానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అరకు, తిరుపతి ఎంపిలు డాక్టర్ తనూజా రాణి, డాక్టర్ మద్దెల గురుమూర్తిల ఆధ్వర్యంలో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు పచ్చ కామెర్ల వ్యాధి బారిన పడి ఇద్దరు మృతి చెందటం, వంద మందికి పైగా విద్యార్థినిలు ఆసుపత్రిలో చేరటం తదితర అంశాలపై వినతి పత్రాన్ని అందజేసారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, నిరుపేద గిరిజన కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించ లేదని, కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించలేదని పిర్యాదు చేశారు. చైర్ పర్సన్ ను కలిసిన వారిలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణిలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు మాజీ ఎంపీ జి. మాధవి, జిసిసి మాజీ చైర్పర్సన్, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ స్వాతీ రాణి, పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజులున్నారు. తాము చెప్పిన వివరాలు, విద్యార్థినిల మృతి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి దుస్థితిని విన్న జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ చలించిపోయారని, వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక బృందాన్ని పంపిస్తామని, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామంటూ హామీ ఇచ్చారని, రాజన్న దొర తెలిపారు.
షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్ పర్సన్ ను కలిసిన వైకాపా నేతలు .
October 14, 2025
0
Tags
