ఢిల్లీలో ఇటీవల జరిగిన ప్రధాని ధన్ ధాన్య యోజన మరియు సహజ వ్యవసాయ ధ్రువపత్రం కార్యక్రమంలో, శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రాఘవంపల్లి గ్రామానికి చెందిన సహజ వ్యవసాయ రైతు మహిళ సాకే గంగమ్మ, అన్నమయ్య జిల్లాకు చెందిన సురం శ్రీదేవి తో కలిసి దేశ గర్వకారణమైన ఘనతను సాధించారు. ఈ సందర్భంగా వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని, భారతీయ సహజ వ్యవసాయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే సామల చిత్రకళ మరియు ఎద్దుల బండి ప్రతిరూపంతో సన్మానించారు. ఈ సత్కారం భారతదేశ సహజ వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, సంప్రదాయాన్ని సంరక్షించే క్రమంలో జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) ఆత్మను ప్రతినిధ్యం వహించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గంగమ్మ ని అభినందిస్తూ – ప్రకృతి ముందుకు నడిపితే రైతులు ఎదుగుతారు, భారత్ అభివృద్ధి చెందుతుంది
అని పేర్కొని, సహజ వ్యవసాయం పట్ల తన మద్దతును వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, ఆయన నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, రాఘవంపల్లి గ్రామానికి వెళ్లి గంగమ్మ ని స్వగృహంలో సన్మానించి, ఆమెను, మంత్రి సత్యకుమార్ యాదవ్ తో ఫోన్ ద్వారా మాట్లాడించారు. మంత్రి సత్య కుమార్ యాదవ్, గంగమ్మ కి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ – మీరు ధర్మవరం ప్రాంతానికి గర్వకారణం. మీరు చూపించిన సహజ వ్యవసాయ నిబద్ధత మరెందరికీ ప్రేరణ కావాలి. త్వరలోనే మీ ఇంటికి స్వయంగా వస్తాను అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ – ధర్మవరం ప్రాంత రైతులు సహజ వ్యవసాయం దిశగా ముందుకు సాగడం ఆనందకర విషయం. ప్రధాన మంత్రి మోడీ స్వయంగా ప్రశంసించిన గంగమ్మ వంటి రైతులు మన ప్రాంతానికి గౌరవాన్ని తెచ్చిపెడుతున్నారు
