![]() |
| అవినీతి లో తగ్గేదేలే |
జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం
తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం
దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరియు ఫోటోలు తీశారు. కెమెరా రికార్డ్ చేస్తుండగానే వీఆర్వో తాసిల్దార్ కార్యాలయంలో ఆ డబ్బును బహిరంగంగానే తీసుకున్నాడు. ఈ అవినీతి తతంగాన్ని చిత్రీకరించిన జర్నలిస్ట్ ఆ సాక్ష్యాలను మీడియాకు విడుదల చేశారు.
రికార్డుల్లో ఫోర్జరీ ఆరోపణలు
లంచం ఇస్తే చాలు, రికార్డుల్లో ఎలాంటి వివరాలు నమోదు చేయకుండానే ఎంఆర్‌వో సంతకాలు సైతం ఫోర్జరీ చేసేంత దుస్సాహసానికి కొందరు వీఆర్వోలు తెగబడుతున్నారని బాధితులు విమర్శిస్తున్నారు. ఇలాంటి అవినీతి ఘటనలు ఈ కార్యాలయంలో ఇంకెన్ని జరుగుతున్నాయోనని ఉద్యోగులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జర్నలిస్ట్ నుంచి లంచం తీసుకున్న ఈ వీఆర్వో అవినీతి తతంగాన్ని తక్షణమే విచారించి, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు జర్నలిస్టులు మరియు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

Comments
Post a Comment