వరంగల్ : నిషేధిత సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి మంద రూబెన్ అలియాస్ కన్నన్న @మంగన్న @సురేష్ (67) మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఎదుట లొంగిపోయాడు. రూబెన్ హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందినవాడు.
1979లో కాజీపేట ఆర్.ఈ.సి.లో పనిచేస్తున్న సమయంలో మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ప్రభావంతో ఉద్యమంలో చేరాడు. 1981 నుంచి 1986 వరకు బస్టర్ ప్రాంతంలో నేషనల్ పార్క్ దళ కమాండర్ లంక పాపిరెడ్డి నేతృత్వంలో దళ సభ్యుడిగా పనిచేశాడు. అనంతరం ఏరియా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. 1991లో చత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేయగా, ఏడాది తర్వాత జైలును తప్పించుకొని మళ్లీ పార్టీలో చేరాడు.
1999లో పార్టీ నాయకుడు రామన్న సాక్షిగా బీజాపూర్ జిల్లాకు చెందిన పొడియం భీమేతో వివాహం జరిగింది. 2005 వరకు చురుకుగా పనిచేసిన రూబెన్ తర్వాత అనారోగ్యం కారణంగా కార్యకలాపాలనుంచి దూరమై గ్రామంలో కోళ్లు, గొర్రెలు పెంచుతూ జీవించాడు. అయితే, అదే సమయంలో పార్టీ దళాలకు ఆహారం, వసతి, సమాచారం అందించే బాధ్యతలు తీసుకున్నాడు.
తన వయస్సు, అనారోగ్యం, మావోయిస్టు సిద్ధాంతాల పాతబడటం, ప్రజల వ్యతిరేకత, అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలను దృష్టిలో ఉంచుకొని లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్లు రూబెన్ వెల్లడించాడు.
రూబెన్ పాల్పడిన నేరాలు:
→ కుంట దళంలో భాగంగా పలు గ్రామస్థుల హత్యల్లో పాల్గొన్నాడు.
→ 1988లో గొల్లపల్లి–మారాయి గూడ రోడ్డుపై సి.ఆర్.పీ.ఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి 20 మందిని హత్య చేసిన కేసులో నిందితుడు.
→ 1990లో తుర్లపాడు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డాడు.
రూబెన్‌పై రూ.8 లక్షల రివార్డు ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Comments
Post a Comment