కర్నూలు, అక్టోబర్ 14, 2025:
ఈ నెల 16న కర్నూలుకు రానున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసి, శ్రీ బాగ్ ఒప్పందం (16-11-1937) ప్రకారం రాయలసీమలోని కర్నూలులోనే ప్రధాన హైకోర్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వినతిపత్రాలు సమర్పించేందుకు కర్నూలు హైకోర్టు సాధన సమితి సభ్యులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఈ మేరకు, హైకోర్టు సాధన సమితి సభ్యులైన జి.వి.కృష్ణమూర్తి, కె.నాగరాజు, ఆర్.నరసింహులు, బి.చంద్రుడు, ఎం.సుబ్బయ్య, ఎం.ఆర్.కృష్ణా, ఖాదర్ బాషా, మక్బూల్, కటారు కొండ ఓంకార్, కె.సి.రాముడు, మహబూబ్ బిగ్ మరియు సోమశంకర్ యాదవ్ తదితరుల పేర్లను జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారికి సమర్పించడం జరిగింది.
సమితి సభ్యులు ఈ రోజు ప్రధాని సమావేశ వేదిక ప్రాంతానికి చేరుకుని, ఏర్పాట్ల తీరును పరిశీలించారు. అనంతరం, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను కలిసి, పై సభ్యుల వివరాలను అందించారు.
జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు ఈ వివరాలను ప్రధానమంత్రి సెక్యూరిటీ వింగ్ (SPG Wing) – Z+ కేటగిరీ భద్రతకు సంబంధించిన విభాగానికి పరిశీలన నిమిత్తం పంపినట్లు తెలిసింది. సెక్యూరిటీ వింగ్ పరిశీలన మరియు ఆమోదం అందిన వెంటనే, ఈ సభ్యులకు ప్రధానిని కలిసేందుకు రేపు (అక్టోబర్ 15) అనుమతి లభించే అవకాశం ఉందని సమాచారం. తమ పోరాటంలో భాగంగా ప్రధానికి తమ సమస్యను నేరుగా తెలియజేయడానికి ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు సాధన సమితి సభ్యులు తెలిపారు.

Comments
Post a Comment