చెన్నయ్యపాలెం జన ప్రభంజనం: సామాన్య కార్యకర్తకు సమున్నత గౌరవం
పల్నాడు జిల్లా, మాచవరం మండలం: విజయదశమి సందర్భంగా పల్నాడు జిల్లా మాచవరం మండలం చెన్నయ్యపాలెం గ్రామంలో రెట్టింపు పండుగ వాతావరణం నెలకొంది. కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన తమ గ్రామబిడ్డ నాదెండ్ల బ్రహ్మం చౌదరికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఊరంతా ఏకమై, దండులా కదిలి వచ్చి చైర్మన్‌కు బ్రహ్మరథం పట్టారు.
శ్రమకు, పోరాటానికి దక్కిన సముచిత స్థానం
సామాన్య కార్యకర్త స్థాయి నుంచి సమున్నత పదవికి ఎదిగిన బ్రహ్మం చౌదరి ప్రస్థానం ప్రత్యేకమైనది. బాల్యంలో పట్టిన పసుపు జెండానే తన అజెండాగా మలుచుకుని, విద్యార్థి రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందారు. ఆయన కృషి, పట్టుదల, అవిశ్రాంతమైన పోరాటం పల్నాడు పౌరుషాన్ని రాష్ట్రమంతటా చాటిచెప్పాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై బ్రహ్మం చౌదరికి ఉన్న అవ్యాజ్యమైన అభిమానం, తెలుగుదేశం పార్టీపై ప్రగాఢమైన ప్రేమ ఆయనను ఈ స్థాయికి చేర్చాయి.
ముఖ్యంగా, గత ప్రభుత్వ హయాంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొని నిలబడిన వైనం రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఎందరో అభిమానులను తెచ్చిపెట్టింది. అటువంటి నాయకుడికి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంపై తెలుగుదేశం పార్టీలోని ప్రతి కార్యకర్తలోనూ సంబరం వెల్లివిరిసింది. ఒక సామాన్య కార్యకర్తకు సమున్నత స్థానాన్ని ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేష్ గార్లపై గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపించారు.
ఊరంతా కోలాహలం... నీరజనాలు
తమ గ్రామంలో పుట్టిన బిడ్డ, ఇంతటి ఘన కీర్తిని సాధించి తొలిసారిగా గ్రామంలో అడుగుపెట్టడంతో చెన్నయ్యపాలెంలో కులమతాలకు అతీతంగా కోలాహలం నెలకొంది. గ్రామస్తులంతా ఏకమై, డప్పు వాయిద్యాలు, నీరజనాలతో తమ ప్రియతమ నాయకుడికి ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగతం, ఆదరణ చూస్తే... అన్ని అర్హతలు ఉన్న ఒక కార్యకర్తకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత గౌరవం లభిస్తే ప్రజలు ఎంతగా ఆనందపడతారో స్పష్టమవుతుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.
తద్వారా, తమ గ్రామం పేరును రాష్ట్రవ్యాప్తంగా మారుమోగించేలా సమున్నత పదవిని సాధించిన బ్రహ్మం చౌదరి రాక, దసరా పండుగతో కలిసి ఆ గ్రామస్తులకు మరపురాని మధురానుభూతిని మిగిల్చింది.





