ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 08
తాడిమర్రి: గ్రామీణ ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలను నేటితరం యువత తప్పక అనుసరించాలని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ సూచించారు.
తాడిమర్రి మండల కేంద్రంలో బుధవారం ఘనంగా జరిగిన శ్రీ ఆర్వేడు పట్నం పెదయ్య స్వామి జల్ది పూజ, పెద్దమ్మ, యల్లమ్మ సాగు మహోత్సవం కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీరామ్ పెదయ్య స్వామి, పెద్దమ్మ, యల్లమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాంప్రదాయాలు గొప్పవని కొనియాడిన శ్రీరామ్
ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... పెదయ్య స్వామి జల్ది పూజలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంతమంది జనం ఒకచోట కలవడం ఐక్యతకు నిదర్శనమని ఆనందం వ్యక్తం చేశారు.
77 గుడికట్లలో వెలసిన ఏకైక దైవం శ్రీ ఆర్వేడు పట్నం పెదయ్య స్వామి అని, ఈ ప్రాంత ప్రజలు ఆయనను మహిమగల దైవంగా కొలుస్తారని తెలిపారు.
భిన్నమైన సాంప్రదాయాలు: ఇక్కడి సాంప్రదాయాలు ప్రత్యేకించి చాలా భిన్నంగా ఉంటాయని, వాటిని తరతరాలుగా కొనసాగిస్తున్న గ్రామస్తులను ఆయన అభినందించారు. ఈ సంప్రదాయాన్ని ముందు తరాల వారికి అందించే విధంగా కొనసాగించాలని కోరారు.
యువతకు సందేశం: యువత చదువుకొని ఎంత ఉన్నత శిఖరాల్లో ఉన్నప్పటికీ, మన ప్రాంతంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలను మాత్రం ఎప్పటికీ మరువకూడదు అని ఉద్బోధించారు.
ఇలాంటి దైవ కార్యమ్రాల్లో వీలైనప్పుడల్లా పాల్గొని, మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందని శ్రీరామ్ అభిప్రాయపడ్డారు.
శ్రీ ఆర్వేడు పట్నం పెదయ్య స్వామి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని పరిటాల శ్రీరామ్ ఆకాంక్షించారు.
