మీ వంటి యువతే దేశం భవిష్యత్తు” ––మంత్రి సత్యకుమార్ యాదవ్
ధర్మవరం,మనజన ప్రగతి అక్టోబర్ 26:— కర్నూలు జిల్లాలో రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఘోర బస్ ప్రమాదంలో, తక్షణ స్పందనతో పది మందికి పైగా ప్రయాణికులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన ధర్మవరం యువకులు హరీష్ కుమార్, జ్ఞానేంద్ర, వంశీ ల వీరోచిత చర్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. ఆదివారం మంత్రి సత్యకుమార్ యాదవ్, ధర్మవరం పట్టణంలోని ఈ యువకుల నివాసాలకు వెళ్లి, వారిని కలుసుకుని వారి ధైర్యసాహసాన్ని ప్రశంసిస్తూ సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..., ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న వేళ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు లాగి రక్షించిన ఈ యువకుల చర్య మానవత్వానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. మన సమాజంలో ఇలాంటి ధైర్యవంతులైన యువకులు ఉండటం గర్వకారణం. ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పటికీ, వారు చూపిన సేవా మనోభావం ప్రతి యువతకు ఆదర్శం. మానవత్వం ముందు భయాన్ని జయించడం, సేవా తపనతో ముందుకు రావడం అనేది నిజమైన వీరోచిత చర్య అని అన్నారు. ప్రజల కోసం నిర్భయంగా ముందుకు వచ్చి ప్రాణాలను కాపాడిన ధర్మవరం యువకులు హరీష్ కుమార్, జ్ఞానేంద్ర, వంశీ – మీరు సమాజానికి ప్రేరణ. మీలాంటి యువతే దేశం భవిష్యత్తు. మీ సేవా తపనకు నా హృదయపూర్వక అభినందనలు.

Comments
Post a Comment