విద్యా రంగ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్‌ఎఫ్ పిలుపు
రూ. 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
విజయవాడ:
రాష్ట్రంలో నెలకొన్న విద్యా రంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఉద్యమబాట పట్టిందని ఏ ఐ యస్ యఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందూ పేర్కొన్నారు.దీనిలో భాగంగా ఈ నెల నవంబర్ 28న విజయవాడ వేదికగా ‘AISF విద్యార్థి పోరు’ పేరుతో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రకటించిందని చందూ తెలిపారు.
ఈ సందర్భంగా చందూ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ. 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవే:
ఈ ‘విద్యార్థి పోరు’ ద్వారా AISF ప్రభుత్వం ముందు ఈ క్రింది 10 ప్రధాన డిమాండ్లను ఉంచింది:
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ‘పిపిపి’ (PPP) విధానంలో ప్రైవేటీకరణ చేయడాన్ని ఉపసంహరించుకోవాలి.
ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలి, మూసివేసిన పాఠశాలలను పునఃప్రారంభించాలి.
పేద విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) విద్యను దూరం చేస్తున్న జి.ఓ. నెం: 77 ను తక్షణం రద్దు చేయాలి.
విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,480 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి.
సంక్షేమ హాస్టల్స్‌లో మౌలిక వసతులు కల్పించి, విద్యార్థుల మరణాలను అరికట్టాలి.
జూనియర్, డిగ్రీ, యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి.
ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ/పాలిటెక్నిక్/ఐటిఐ, మండలానికి ఒక జూనియర్ కళాశాలను నిర్మించాలి.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలి.
కామన్ పి.జి సెట్ విధానాన్ని రద్దు చేయాలి.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తలపెట్టిన ఈ పోరులో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని AISF రాష్ట్ర సమితి పిలుపునిచ్చినట్లు జిల్లా సహాయ కార్య దర్శి తగ్గుపర్తి.చందూ తెలిపారు.


Comments
Post a Comment