ఉరవకొండ,
జిల్లా గ్రంథాలయ సంస్థ, అనంతపురం ఆధ్వర్యంలో పనిచేయుచున్న శాఖా గ్రంథాలయం ఉరవకొండ నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మండల విద్యాధికారి (M.E.O.) ఈశ్వరప్ప ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాలను ప్రారంభించారు.
చాచా నెహ్రూకు నివాళులు:
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలుత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి ఎంఈఓ ఈశ్వరప్ప పూలమాల వేసి నివాళులర్పించారు.
పుస్తక సంపదను సద్వినియోగం చేసుకోండి:
ఈ సందర్భంగా ఎంఈఓ ఈశ్వరప్ప విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న అపారమైన పుస్తక సంపదను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. "ఎక్కడ అందుబాటులో లేని పురాతన పుస్తకాలు సైతం గ్రంథాలయాలలో లభిస్తాయి. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవడం మనందరి బాధ్యత," అని తెలిపారు.
గ్రంథాలయ ఉద్యమకారులైన ఎస్. ఆర్. రంగనాథన్, కల్లూరు సుబ్బారావు, అయ్యాంకి వెంకటరమణయ్య వంటి వారి కృషి వలనే నేడు ఇన్ని గ్రంథాలయాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. సాహిత్యంపై తనకు మక్కువ గ్రంథాలయం ద్వారానే పెరిగిందని, సాంకేతికత ఎంత పెరిగినా పుస్తకం విలువ ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు.
పోటీల్లో పాల్గొనాలని విజ్ఞప్తి:
అనంతరం గ్రంథాలయాధికారి వై. ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు అన్ని రకాల పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని కోరారు. ఏ ఒక్క పుస్తకం తక్కువ కాదని, చిన్న పుస్తకం చదవడం ద్వారా కూడా ఎంతో జ్ఞానం సంపాదించవచ్చని తెలిపారు.
నవంబర్ 14 నుండి 20 వరకు ఈ వారోత్సవాల సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామని, విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Comments
Post a Comment