వజ్రకరూరు మండలం:
సమాజంలో యువతరం సేవాభావంతో పనిచేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని, సమాజానికి సేవ చేయడం ద్వారానే గౌరవ మర్యాదలు లభిస్తాయని బంజారా సంఘం జాతీయ నేత ఎస్.కె. కేశవ నాయక్ స్పష్టం చేశారు.
సోమవారం, వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండా గ్రామ పంచాయతీలో జరిగిన ఓ అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఆదర్శ ఎలక్ట్రీషియన్ ఆర్. గోపీ నాయక్, తమ తండాలోని బంజారాల ఆరాధ్య దైవం తుల్జా భవాని గురు నానక్ దేవాలయాలకు ఉచితంగా వైరింగ్ పనులు చేసి, విద్యుత్ దీపాలను వితరణ చేశారు. ఈ గొప్ప సేవా కార్యక్రమాన్ని పురస్కరించుకుని గ్రామ పెద్దలు ఆయనకు అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఈ సభకు నంగరేర్ నాయక్ ఎస్.కె. సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు.
గోపీ నాయక్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: వక్తల ప్రశంసలు
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, గోపీ నాయక్ చేసిన సేవలను కొనియాడారు. గోపీ నాయక్‌ను ఆదర్శంగా తీసుకొని, గ్రామాభివృద్ధి కోసం యువతరం ముందుకొచ్చి స్వచ్ఛందంగా సేవలు చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
కేశవ నాయక్ మాట్లాడుతూ, సమాజానికి సేవ చేసిన వ్యక్తిని గౌరవించడం తమ బాధ్యత అని, గోపీ నాయక్ సేవ ఆదర్శప్రాయమని అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు దాసు నాయక్, ఉమాపతి నాయక్, కార్బరీ ఊదా నాయక్, ఎం. నారాయణ నాయక్, లక్ష్మా నాయక్, వి. నరసంగనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment