- రూ. 9.23 లక్షలు దాటిన ఎడిసన్ స్కూల్ అద్దె బకాయిలు
- లీజు గడువు ముగిసినా అధికారుల నిర్లక్ష్యం
- పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా? అంటూ భక్తుల ఆగ్రహం
ఉరవకొండ:
ఉరవకొండలోని చారిత్రక గవిమఠం సంస్థానం ఆస్తుల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మఠం ఆవరణలో నిర్వహిస్తున్న 'ది ఎడిసన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల' లీజు వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. లీజు గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా, అటు బహిరంగ వేలం వేయక, ఇటు పేరుకుపోయిన బకాయిలు వసూలు చేయక అధికారులు తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ. 9.23 లక్షల బకాయిలు.. పట్టించుకోని అధికారులు:
గత మూడేళ్లుగా పాఠశాల యాజమాన్యం మఠానికి చెల్లించాల్సిన అద్దె బకాయిలు ఏకంగా రూ. 9,23,000కు చేరుకున్నాయి. సాధారణంగా పేద, మధ్యతరగతి వారు మఠం షాపులు అద్దెకు తీసుకుని ఒక్క నెల బకాయి పడితేనే ముక్కుపిండి వసూలు చేసే అధికారులు, పాఠశాల యాజమాన్యం విషయంలో మాత్రం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. "పేదలకు ఒక రూలు.. పెద్దలకు మరో రూలా?" అంటూ నిలదీస్తున్నారు.
అక్రమ సబ్ లీజు దందా:
గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పాఠశాల స్థలాన్ని చట్టవిరుద్ధంగా రామపురానికి చెందిన మరో వ్యక్తికి 'గుడ్ విల్' తీసుకుని సబ్ లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు లీజుదారుడు పాఠశాలను అప్పగించి ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో, ప్రస్తుతం ఉన్న సబ్ లీజుదారులు బకాయిలు చెల్లించడం లేదని సమాచారం.
గత పాలకుల నిర్లక్ష్యం:
గతంలో మేనేజర్‌గా పనిచేసిన చిట్టెమ్మ సామాజిక వర్గ సమీకరణాలతో బకాయిల వసూలుపై దృష్టి సారించలేదనే విమర్శలున్నాయి. అప్పట్లో పత్రికల్లో కథనాలు రావడంతో నామమాత్రపు చర్యలు తీసుకున్నారు తప్ప, పూర్తిస్థాయిలో బకాయిలు రాబట్టలేదు. లీజు పునరుద్ధరించుకోవాలని లేదా ఖాళీ చేయాలని మూడుసార్లు నోటీసులు జారీ చేసినా యాజమాన్యం స్పందించలేదు.
తక్షణమే వేలం నిర్వహించాలి:
తాజాగా రెండు రోజుల క్రితం అధికారులు పాఠశాల వద్దకు వెళ్లి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా, తక్షణమే బకాయిలన్నీ వసూలు చేసి, పాత లీజును రద్దు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పారదర్శకంగా బహిరంగ వేలం పాట నిర్వహించి మఠం ఆస్తులను కాపాడాలని కోరుతున్నారు.

Comments
Post a Comment