ఎవరు భగీరథుడు?ఎవరు రాయలసీమ ద్రోహి*? కింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి సవితమ్మ గారు! కేవీ రమణ

Malapati
0


ఎడారిగా మారుతున్న అనంతపురం జిల్లాకు జీవనాడి అయిన *హంద్రీ-నీవా* ను 6500 క్యూసెక్కులకు పెంచుతూ టెండర్లు పిలిచిన దానిని రద్దుచేసి,3850 క్యూసెక్కులు తీసుకురావడానికి 3850 కోట్లు ఖర్చు పెట్టారు, ప్రతిరోజు 3850 క్యూసెక్కులు నీరు వచ్చి ఉంటే మూడు రోజులకు ఒక టీఎంసీ ప్రకారం నెలకు పది టీఎంసీలు,ఐదున్నర నెలలకు 55 టీఎంసీలు వచ్చి ఉండాలి కదా? అధికారిక లెక్కల ప్రకారం 32 టీఎంసీలే ఎందుకు వచ్చాయి?

     11500 క్యూసెక్కులు నీటి ప్రవాహం ఉంటే రోజుకు ఒక టీఎంసీ నీళ్లు వస్తాయి,కృష్ణ నది వరద గ్యారెంటీ రోజులు 40,హంద్రీ-నీవా లక్ష్యం ప్రకారం 40 టీఎంసీలు రావాలంటే రోజుకు ఒక టీఎంసీ ప్రకారం 40 టీఎంసీలు రావాలి.మరి నేడు అయిదున్నర నెలలుగా పంపింగ్ జరుగుతున్నా 32 టీఎంసీలు మించి రాలేదంటే, హంద్రీ-నీవా పథకం పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్లా? లేనట్లా?

     మీరన్నట్లు *కుప్పం* వరకు నీరు ఈరోజే వెళ్లిందా? గతంలో కూడా 40 టీఎంసీలు వచ్చాయి కదా అలాంటప్పుడు మీరు ఖర్చు చేసిన 3850 కోట్లు డబ్బు వల్ల అదనంగా నీరు వచ్చిందని చెప్పగలరా? చెప్పలేకపోతే ఆ డబ్బు ఎవరి జేబులోకి వెళ్ళినట్టు?

    గత ప్రభుత్వం ఒక్క పిల్ల కాలువైనా తీసిందా అని ప్రశ్నిస్తున్న మీరు, 2012లోనే నీరు వచ్చిన హంద్రీ-నీవాకు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు ఒక్క పిల్లకాలువ అయిన తీశారా? ఒక్క ఎకరాకు అదనంగా నీరు ఇచ్చారా? 

     గాలేరు-నగరిని హంద్రీ-నీవాకు అనుసంధానం చేయడం వల్ల కడప,చిత్తూరు జిల్లాలలో లక్ష ఎకరాల ఆయకట్టు పెరగడంతో పాటు హంద్రీ-నీవా నీళ్లు కర్నూలు, అనంతపురం జిల్లాలకే పరిమితం చేయడంలో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి 1500 కోట్లు ఖర్చుచేసిన,రాయలసీమకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన స్కీమును ఎందుకు ఆపేశారు? 

      రాయలసీమ ఎత్తిపోతల పథకం* ద్వారా రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోసి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నిస్తే,మద్రాసు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి అడ్డుకున్నది ఎవరు?

     రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తున్నట్లు *చంద్రబాబు మాట ఇచ్చినాడని తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజం కాదా? ఇది *రాయలసీమ ద్రోహం* గాక రాయలసీమకు *బంగారు బాట* అవుతుందా? 

  శ్రీశైలం నీటిమట్టం 854 అడుగులు ఉంటే తప్ప రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీరు అందదని *వైయస్సార్* జీవో చేస్తే, కృష్ణా డెల్టా బీడుగా మారిపోతుందని ఆ జీవోకు వ్యతిరేకంగా మీ పార్టీ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేసింది నిజం కాదా? 

  పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్* సామర్ధ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కులకు పెంచడానికి ప్రయత్నం చేస్తే, దానికి వ్యతిరేకంగా మీ పార్టీ ప్రకాశం జిల్లా నాయకులు, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచకూడదని పోరాటం చేసింది నిజం కాదా?

      1996లో చంద్రబాబు గారు ప్రారంభించిన *వెలుగోడు ప్రాజెక్టు* 30 సంవత్సరములలో మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా ఎందుకు పూర్తి చేయలేదు?

     విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు కేంద్రమే నిర్మించాల్సిన *పోలవరం ప్రాజెక్టు* 11 సంవత్సరములుగా పూర్తి కాకుండా నత్తనడకన సాగడానికి,కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును తామే నిర్మిస్తామని ఒప్పుకోవడం కాదా?

       విభజన చట్టంలో పొందుపరిచిన *కడప ఉక్కు* ను ప్రారంభించకుండా పోవడానికి కారణం విభజనా నంతరం మొదట అధికారాన్ని చేపట్టిన మీరు కాదా?

      తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను కలపడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రీశైలంమీద,*సిద్దేశ్వరం-అలుగు* దగ్గర నిర్మించ తలపెట్టిన *తీగల వంతెన జాతీయ రహదారి* ని *రోడ్డు కం బ్రిడ్జి* గా మార్చడం వల్ల ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 50 టీఎంసీల నీటిని నిలుపుకొని కరువు సీమకు మళ్లించవచ్చు, అలాంటప్పుడు కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న మీరు ఎందుకు ఒప్పించలేక పోతున్నారు?

     రాయలసీమకు నీళ్లు ఇచ్చింది *ఎన్టీఆర్* అని చెప్పగలుగుతున్నారే గాని చంద్రబాబు పేరు ఎందుకు చెప్పలేక పోతున్నారు?

      *అన్నమయ్య డ్యాం* కొట్టుకుపోయింది గత ప్రభుత్వం ఏమి చేయలేదని చెప్తున్నారు,మరి ఈ రెండు సంవత్సరముల కాలంలో మీరు చేసింది ఏమిటో చెప్పగలరా?

     విభజన చట్టంలో పొందుపరిచిన వెనుకబడిన ప్రాంతాలకు *బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ*, *ప్రత్యేక హోదా* వద్దని *ప్రత్యేక ప్యాకేజీ* తీసుకొని రాయలసీమ కడుపు కొట్టింది ఎవరు?

     *కరువు సీమ* ఆదాయాన్ని *అమరావతి* లో అప్పనంగా ఖర్చు చేస్తుంటే కళ్లప్పగించి చూస్తున్న మీరు రాయలసీమ ద్రోహులు కాదంటారా?

    ఈ రాష్ట్రాన్ని16 సంవత్సరములు మీరే పాలించారు.అయినా రాయలసీమ,ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయి? మీరు కారణం కాదంటారా? ఈ ప్రశ్నలు వేసుకున్న తర్వాత కూడా మీకు ఎవరు భగీరథుడు? ఎవరు రాయలసీమ ద్రోహి? అన్నది స్పృహణకు రాకపోతే నిజంగా మీరు *సీమ బిడ్డ* కాదని *సీమ పౌరుషం* లేదని,మంత్రి పదవులు శాశ్వతం కాదని,నిజాలు మాట్లాడకపోతే చరిత్రలో చిత్తు కాగితాలుగా మిగిలిపోతారని చెప్పక తప్పదు. 


Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!