ప్రభుత్వ ధర ₹125 అయితే, కార్పొరేట్ ఫీజు ₹1000కి పైనే
అనంతపురం, ఆంధ్రప్రదేశ్: పదవ తరగతి పరీక్ష ఫీజు విషయంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ (AISF) ఆధ్వర్యంలో అనంతపురం డీఈఓ (DEO) కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ప్రధాన డిమాండ్లు:
ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజు ₹125 మాత్రమే కాగా, జిల్లాలోని కొన్ని విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ₹800 నుంచి ₹1000 వరకు వసూలు చేస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఉన్నతాధికారులకు డబ్బు చెల్లించాలంటూ యాజమాన్యాలు తల్లిదండ్రులకు బహిరంగంగా చెబుతున్నాయని వారు ఆరోపించారు.
దోపిడీని ఆపాలని డిమాండ్:
పరీక్ష ఫీజులే కాకుండా, పుస్తకాలు, మెటీరియల్స్ పేరుతో కూడా వేల రూపాయల దోపిడీ జరుగుతోందని, ఈ దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. దీనిపై తక్షణమే విచారణ కమిటీని నియమించి, అధిక ఫీజులు వసూలు చేసిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
అధికారుల స్పందన:
ధర్నా అనంతరం ఏఐఎస్ఎఫ్ నాయకులు డీఈఓ ప్రసాద్ బాబుకు వినతి పత్రం అందించారు. దీనికి స్పందించిన డీఈఓ , అధిక ఫీజుల వసూళ్లపై విచారణ జరిపేందుకు వెంటనే డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలతో కూడిన కమిటీని వేసి సర్క్యులర్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులుకుళ్లాయి స్వామి, తగ్గుపర్తి చందు, మంజునాథ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment