పరీక్ష ఫీజు చెల్లించిన మంత్రి సత్యకుమార్ యాదవ్; 2,087 మంది పేద విద్యార్థులకు ఉపశమనం
ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా డిసెంబర్ 5:
శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం నియోజకవర్గంలోని పదో తరగతి పేద విద్యార్థులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అండగా నిలిచారు. పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న 2,087 మంది విద్యార్థుల పరీక్షల ఫీజు మొత్తాన్ని ఆయన తన సొంత ఖర్చులతో చెల్లించి తన ఉదారతను చాటుకున్నారు.
రూ. 2,60,875 చెల్లింపు
ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని 41 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 125 చొప్పున మొత్తం రూ. 2,60,875 ఫీజును విద్యా శాఖకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని స్థానిక ఎమ్మెల్యే కూడా అయిన మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా విద్యా శాఖ అధికారి (DEO) ద్వారా నేరుగా చెల్లించారు. ఈ మేరకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కార్యక్రమం బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వర్తిస్తుంది. లబ్ధిపొందిన వారిలో 1,096 మంది బాలికలు ఉన్నారు.
ప్రేరణ, ప్రోత్సాహం కోసం చిరు ప్రయత్నం
మంత్రి సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న పేద విద్యార్థులకు ఇది ఒక ప్రోత్సాహకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే మంత్రి ఈ "చిరు ప్రయత్నం" చేశారు. ఈ చొరవ విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, వారిలో మరింత ప్రేరణను నింపింది.
పేద విద్యార్థులపట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ చూపిన ప్రేమాభిమానాలను, ఆయన చొరవను ధర్మవరం నియోజకవర్గ వాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారు.

Comments
Post a Comment